Tuesday, December 30, 2014

09 - ప్రియుడా .. నా చెలికాడా



నీతో పాటు నీ పక్కన నడుస్తున్నప్పుడు
నేనేం చేస్తాను ?

వెనక్కో ముందుకో కాకుండా నీతో సమంగా అడుగులేస్తానా ?
నీ చేయి పట్టుకొని నడుస్తూ ఏమేమి నీతో మాట్లాడతానో ?
నేను చూసిందే నువ్వూ చూస్తున్నావా అని పరీక్షిస్తానేమో ?
ఆలోచిస్తున్నాను
ఒక్కొక్క గంట
రోజంతా
సంవత్సరాలు, నెలలు ,
నీతో నడవడం గురించే

నువ్వు నా ముందుకు రాగానే
ఎగిరే పక్షినై పోతానేమో
నెమలినై నృత్యం చేస్తానేమో
వెంటనే హల్లెలూయా అని స్తుతించడం మొదలుపెడతానేమో
లేదా ..
ఉన్న పళాన నీ ముందు మోకరిల్లి
నీ పాదాలదగ్గర పడున్న మంచులో కరిగిపోతున్న
నా అహం చూస్తానేమో
ఆలోచిస్తున్నాను
ప్రతి ఘడియ
ప్రతి క్షణం నిరంతరం
నీతో సహవాసం గురించి

నన్ను నీలోకి స్వీకరించినప్పుడు
నా చుట్టూ నీ మహిమ అల్లుకున్నప్పుడు
నేనేం చేస్తాను ముకుళిత హస్తాలతో పాటలనదినై పోయి
నిన్ను ఆరాధిస్తూ నీ కళ్ళలో నన్ను చూసుకుంటానేమో
నన్ను నేను నీకు అర్పించుకొని
నీ పాదాలవద్ద దీపమై వెలుగుతుంటానెమో

ప్రియుడా  .. నా చెలికాడా
ఆలోచిస్తున్నాను
ఒక్కొక్క గంట
రోజంతా
సంవత్సరాలు, నెలలు ,
నీలో ఋతువులతో సంబంధం లేకుండా
ఫలించడం గురించే
------------- 31/12/2014 --------------

Wednesday, October 15, 2014

08 -ప్రియుడా .. నా చెలికాడా

నీటిఓరన నాటబడడానికి 
నేను కొట్టుకొచ్చిన క్షణాన
కష్టమే అనిపించింది. 

కాని
పడమటికి తూరుపు ఎంత దూరమో
నా మూర్ఖత్వాన్ని అతిక్రమాన్ని
కఠినత్వాన్ని చంచలబుద్దిని 
చుట్ట చుట్టి అంతదూరం
నువ్వు పడేసిన క్షణం 
పచ్చని చిగుళ్లు వేస్తు 
నేను కొత్తగా జన్మించాను

కృతజ్ఞతగా నీకేమి అర్పించలేని 
ఖాళీచేతుల్ని చూసి 
నాచుట్టున్నవారు నవ్వినప్పుడు
నాకు కూడా నా రిక్తహస్తాలు నచ్చలేదు 

కాని నువ్వన్నావ్ 
విరిగినలిగిన హృదయమే నీకిష్టమైన
బలి అని 

అందుకే
ప్రియుడా .. నా చెలికాడా

నా మోడుబారిన చేతుల్ని 
నీ సన్నిధిలో నాటాలనివచ్చా
నీ వాక్యంతో అంటుకట్టబడి అవి పూస్తున్నప్పుడు
నిన్ను పరిమళసువాసనగా 
ప్రతిచోటకి మోసుకెళ్తా


Tuesday, October 14, 2014

07- ప్రియుడా నా చెలికాడా

ఏది నీ చేయిలా చాచి నన్ను స్పృశించు

నా చుట్టూ ఉన్న మురికి నిన్ను తాకనివ్వలేదు కదూ


ఉదయమే పక్షులు నిన్ను ప్రార్ధించే వేళ
నా మంచంపై  నేను మూల్గుల ప్రార్ధనతో నిన్ను పిలుస్తాను
నాకు గుర్తుంది 
తేజోమూర్తిగా నువ్వు నా దగ్గరగా వస్తావు
నీ శ్వాస పరిమళం సాంబ్రాణి దూపమై నన్ను చుట్టుకున్నప్పుడు
నా జీవంలో ఉదయమై
నీ ముఖం తేటగా కనిపిస్తున్నప్పుడు
నన్ను నీతో నడకకు తీసుకెళ్తావ్

దావీదు కీర్తననొకటి హ్రదయంలోంచి గానం చేస్తూ
నీ ముఖం చూస్తున్న నన్ను చూసి
నా నుదుటిపై ముద్దు పెట్టుకోవాలని దగ్గరగా వచ్చావ్
కాని నన్ను తాకకుండా నా ఒంటికున్న మురికి
నిన్నుఆపివేసింది కదూ

జీవవృక్షం
స్పటిక సంద్రం చూపిస్తూ
నిన్ను హత్తుకోవాలనుకున్న నా కాంక్ష తీర్చడానికై
ఆ సిలువ దగ్గరికి నన్ను తోడుకొని వెళ్లి
నీ ప్రేమ నాకు చూపినప్పుడు
నేను నీరై నీలో కలిసిపోయిన మాట నిజం
నన్ను నీలో దాచుకున్న క్షణం 
నేను ఈ మట్టి శరీరాన్ని ప్రేమించడం
మానుకున్నది  నిజం. 

ప్రియుడా నా చెలికాడ ..!! 

బలు రక్కసి చెట్లలో నేనిక్కడే  నీ కోసం
ఎప్పుడూ 
నవ్వుతూ ఉండే వల్లిపద్మం  నేను 

నీ రాకడలో మహిమ శరీరం దాల్చినప్పుడు 
నీ రొమ్మున ఆనుకునే క్షణం కోసం 
ఆపేక్షతో నిరీక్షిస్తున్న గువ్వను నేను. 

Monday, March 10, 2014

06-ప్రియుడా నా చెలికాడా

నువ్వు
పెదవులు మెళ్లిగా కదిలిస్తూ 
ఏమని ప్రార్ధిస్తున్నావో నాకు వినాలని
కోరిక

స్.స్.స్ అని చిన్నశబ్ధంతో 
నువ్వు చేసే ప్రార్ధన నేను విన్నప్పుడు
అర్ధం చేసుకోలేని దైవబాషేదో
నువ్వు ఉచ్చరిస్తున్నట్టుంటుంది

పెదవులు దాటి బయటికొచ్చి
గాలి మోసుకెల్లే కొన్ని ప్రార్ధనా పదాలు
సాంబ్రాణి పొగలా నన్ను చుట్టుకుని స్పృశించి వెళ్తూ
నీ ఆశీర్వాదంలో భాగం చేస్తాయి

నీతో స్వరం కలిపి ఆరాధన చేస్తున్నప్పుడు
ఏన్గెదీ ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో
సమానమైన దైవ కుమారుడు మనల్ని హత్తుకున్నట్టు
ప్రేమగా ముద్దాడుతున్నట్టుంటుంది

త్వరలో మేఘారూడుడై వచ్చే ఆయన్ని
ఎదుర్కొనేందుకు
చెలికాడా .. నీతో పాటు నేను కూడా సిద్ధమే
---------(10/3/2014)-----

Sunday, November 3, 2013

05 - ప్రియుడా నా చెలికాడా

ఇలా.. 
నీతో కొన్ని మాటలు చర్చించాక, 
ఏదేనువనంలో తిరుగుతూ 
పాలు తేనెలు ప్రవహించే తావుల్లోని 
ఫలాలను భుజించినట్టుటుంది.

నీ మాటలు పూలపై పరుచుకున్నప్పుడు 
సీతాకోకచిలుకలు నువ్వే జ్ఞానప్రపంచమని 
పసిగట్టి నీ చుట్టూ తిరుగుతున్నట్టుటుంది.

మొన్నామధ్య నడిరాతిరి వేళ
వర్షపు హోరులా ప్రశ్నలు చ్ట్టుకున్నప్పుడు
ఆకలని అరుస్తున్న అజ్ఞానానికి నీ మాటల క్రొవ్వు మెదడు
భోజనంగా ఇచ్చాను,
అంతే ..!
రూపాంతర అనుభవాన్ని మహాతేజస్సులో ప్రభవించి
జ్ఞానంగా మారి ఎన్ని ముచ్చట్లు చెప్పి౦దో .

నిజమైన ద్రాక్షావల్లీ
నీలో అంటుకట్టబడడం ఎంత అనిర్వచనీయ
ఆనందం..

ప్రియుడా .. నా చెలికాడా ..!

ద్రాక్షఫలాలు విరివిగా పండే కాలం రానైయుంది
కొత్త తిత్తులను సిద్ధం చేయించు.
__________ (4/11/2013)__________

Wednesday, August 14, 2013

04- ప్రియుడా నా చెలికాడా

||04- ప్రియుడా నా చెలికాడా || by Mercy Margaret 


___________________________



అతను కళ్ళు మూసుకొని పాట పాడేప్పుడు 


నాకు రెండు చంద్రులు కనిపిస్తాయి 




మొదటివాడా, కడపటివాడ, మృతుడైనావాడా అంటూ 

పాట మెట్లెక్కించి 


ఒక్కో చరణంలో ఒక్కో ఆకాశాన్ని తన స్వరంతో స్పృశి౦పజేసి 


ప్రేమ రుచి చూపిస్తూ 


ఎండిన గొంతును నీ ప్రేమతో సేద్యం చేస్తాడు 


నీ మాటలు మంచులా కురిపిస్తూ


నా ప్రియుడు చెలికాడు

పరిమళ సుగంధ ద్రవ్యాలను నా గుండెకు పూస్తూ

నీ ప్రేమతో దాన్ని చల్లబరుస్తాడు


తన్మయత్వంతో తను పాడుతున్నప్పుడు


నీ చుట్టూ పరిభ్రమించే ఆ రెండు చంద్రులు

ఆతని కళ్ళు

నాకు నీకోసం వెలిగింప బడ్డ దీపాలుగా కనిపిస్తాయి .

ప్రియుడా

నా చెలికాడా ...!!!!


నీ పాటతో నా ఆత్మకు దవళవర్ణపు వస్త్రం


ఇలాగే తొడిగించు

_________ (14/8/2013)_______


(@copy rights reserved )
||  03- ప్రియుడా నా చెలికాడా..  || by Mercy Margaret
---------------------------------------------------------------
ప్రతి సారి ఇదే ఆఖరు అని మాటల్ని రాలుస్తావ్

రాల్చిన మాటలతో పాదాలు కప్పుకొని

-"నీ వెనకేం రావట్లేదు"అన్నట్టు 

నిశ్శబ్ధపు వర్షంలో

అడుగుల ముద్రల్ని తుడిచేస్తావ్



ధైర్యంగా నా పాదాలు పాడుతూ నడుస్తుంటాయి 

వెనకే ఉంటావన్న ధైర్యంతో గొంతు తడుపుకొని

చీకట్లో లోయలదారులన్ని దాటి వెళ్తూ


వణుకుతున్న దీపంతో పోరాడే చీకటిని చూసి

కళ్లు ఒక్కసారిగా వెనక్కి చూసాయి

నువ్వు కనబడక తొట్రిల్లిన పాదాన్ని

ముళ్లు, గుచ్చి గుచ్చి నవ్వి భయపెడితే


శబ్ధం చేయని రెప్పల్ని చీల్చుకొని తమను తాము విసిరేసుకుంటూ

కళ్లు కన్నీటి అరుపులతో నిన్ను పిలుస్తుంటే

నీ అరచేతులతో వాటిని మూసి

నువ్వు నా పై కప్పిన నవ్వులో
ఎంత ప్రేముందో

ఎంతెంత ధైర్యముందో


ప్రియుడా నా చెలికాడా..!!

నా కనులని వెనుచూడనివ్వను


నువ్వెప్పుడూ నాకన్నా ముందే

నా ప్రయాణంలో నా ముందుండే దారిలా

నాపాదాలకు దారి చూపే దీపంలా..!!

--------------------( 19/6/2013)------

( @copy rights are reserved)