Sunday, November 3, 2013

05 - ప్రియుడా నా చెలికాడా

ఇలా.. 
నీతో కొన్ని మాటలు చర్చించాక, 
ఏదేనువనంలో తిరుగుతూ 
పాలు తేనెలు ప్రవహించే తావుల్లోని 
ఫలాలను భుజించినట్టుటుంది.

నీ మాటలు పూలపై పరుచుకున్నప్పుడు 
సీతాకోకచిలుకలు నువ్వే జ్ఞానప్రపంచమని 
పసిగట్టి నీ చుట్టూ తిరుగుతున్నట్టుటుంది.

మొన్నామధ్య నడిరాతిరి వేళ
వర్షపు హోరులా ప్రశ్నలు చ్ట్టుకున్నప్పుడు
ఆకలని అరుస్తున్న అజ్ఞానానికి నీ మాటల క్రొవ్వు మెదడు
భోజనంగా ఇచ్చాను,
అంతే ..!
రూపాంతర అనుభవాన్ని మహాతేజస్సులో ప్రభవించి
జ్ఞానంగా మారి ఎన్ని ముచ్చట్లు చెప్పి౦దో .

నిజమైన ద్రాక్షావల్లీ
నీలో అంటుకట్టబడడం ఎంత అనిర్వచనీయ
ఆనందం..

ప్రియుడా .. నా చెలికాడా ..!

ద్రాక్షఫలాలు విరివిగా పండే కాలం రానైయుంది
కొత్త తిత్తులను సిద్ధం చేయించు.
__________ (4/11/2013)__________

Wednesday, August 14, 2013

04- ప్రియుడా నా చెలికాడా

||04- ప్రియుడా నా చెలికాడా || by Mercy Margaret 


___________________________



అతను కళ్ళు మూసుకొని పాట పాడేప్పుడు 


నాకు రెండు చంద్రులు కనిపిస్తాయి 




మొదటివాడా, కడపటివాడ, మృతుడైనావాడా అంటూ 

పాట మెట్లెక్కించి 


ఒక్కో చరణంలో ఒక్కో ఆకాశాన్ని తన స్వరంతో స్పృశి౦పజేసి 


ప్రేమ రుచి చూపిస్తూ 


ఎండిన గొంతును నీ ప్రేమతో సేద్యం చేస్తాడు 


నీ మాటలు మంచులా కురిపిస్తూ


నా ప్రియుడు చెలికాడు

పరిమళ సుగంధ ద్రవ్యాలను నా గుండెకు పూస్తూ

నీ ప్రేమతో దాన్ని చల్లబరుస్తాడు


తన్మయత్వంతో తను పాడుతున్నప్పుడు


నీ చుట్టూ పరిభ్రమించే ఆ రెండు చంద్రులు

ఆతని కళ్ళు

నాకు నీకోసం వెలిగింప బడ్డ దీపాలుగా కనిపిస్తాయి .

ప్రియుడా

నా చెలికాడా ...!!!!


నీ పాటతో నా ఆత్మకు దవళవర్ణపు వస్త్రం


ఇలాగే తొడిగించు

_________ (14/8/2013)_______


(@copy rights reserved )
||  03- ప్రియుడా నా చెలికాడా..  || by Mercy Margaret
---------------------------------------------------------------
ప్రతి సారి ఇదే ఆఖరు అని మాటల్ని రాలుస్తావ్

రాల్చిన మాటలతో పాదాలు కప్పుకొని

-"నీ వెనకేం రావట్లేదు"అన్నట్టు 

నిశ్శబ్ధపు వర్షంలో

అడుగుల ముద్రల్ని తుడిచేస్తావ్



ధైర్యంగా నా పాదాలు పాడుతూ నడుస్తుంటాయి 

వెనకే ఉంటావన్న ధైర్యంతో గొంతు తడుపుకొని

చీకట్లో లోయలదారులన్ని దాటి వెళ్తూ


వణుకుతున్న దీపంతో పోరాడే చీకటిని చూసి

కళ్లు ఒక్కసారిగా వెనక్కి చూసాయి

నువ్వు కనబడక తొట్రిల్లిన పాదాన్ని

ముళ్లు, గుచ్చి గుచ్చి నవ్వి భయపెడితే


శబ్ధం చేయని రెప్పల్ని చీల్చుకొని తమను తాము విసిరేసుకుంటూ

కళ్లు కన్నీటి అరుపులతో నిన్ను పిలుస్తుంటే

నీ అరచేతులతో వాటిని మూసి

నువ్వు నా పై కప్పిన నవ్వులో
ఎంత ప్రేముందో

ఎంతెంత ధైర్యముందో


ప్రియుడా నా చెలికాడా..!!

నా కనులని వెనుచూడనివ్వను


నువ్వెప్పుడూ నాకన్నా ముందే

నా ప్రయాణంలో నా ముందుండే దారిలా

నాపాదాలకు దారి చూపే దీపంలా..!!

--------------------( 19/6/2013)------

( @copy rights are reserved)
|| 02 -ప్రియుడా ..నా చెలికాడా ..!! || by Mercy Margaret
---------------------------------------------------------------


కొన్ని అడుగులు వేసి

కొన్ని నిమిషాలు, రంగుమారి రాలిపోతున్నప్పుడు

కొన్ని మాటలు కాంతి సంవత్సరాలంత దూరం ప్రయాణించి


ఆవల ఉన్న తలపులను వెతికి ఏవో పాలపుంతలలో తప్పిపోయినప్పుడు


ఊపిరుల మేఘాలు స్తంభించి వర్షించక రోదిస్తున్నప్పుడు

దోసిలినిండా కలలు కరిగి ఉదయపు నీరు తాగాలని


నిరీక్షిస్తున్నప్పుడు



ప్రియుడా ..

నా చెలికాడా ..!!




కళ్ళు రెండిటిని అద్దంలా తుడిచి


నిన్ను మళ్ళీ కళ్ళలో ప్రతిష్టించుకుంటాను




కొన్ని నిమిషాల వియోగం కూడా


యుగాల నరకం అంత బాధిస్తుంటే


నువ్వు నా కళ్ళలో వెలిగే దీపమై నా చలనానికి మూలమని


తెలిసికూడా




ఎందుకు నా కనురెప్పల్ని బరువెక్కించి


నీ గురించి నిరీక్షించకుండా ఎందుకు అడ్డుకుంటావని


ప్రశ్నలతో నిద్దురను కాయాలనుకుంటాను . ..!


--------------------- (8/5/2013)-----------------
(@copy rights are reserved)
|| 01 - ప్రియుడా నా చెలికాడా....!! || by Mercy Margaret
-----------------------------------------------------------------
రాలిపొయిన ఆకులన్నీ


గాలికి కొట్టుకుపోయి


తొలకరి వర్షం ఆసాంతం తడిపి


గాలి గుస గుసగా కొన్ని ఊసులు


మోసుకొనొచ్చి మెత్తగా తడుముతున్నప్పుడు



చినిగి పొయిన గుండెకు


కుట్లేసుకుంటూ


మనసుకు అంటుకున్న 

మాటల మసి తుడుచుకుంటూ

ఆకాశం వైపెత్తిన కళ్లు కన్నీల భాష

మాట్లాడుతుంటే


దృష్టి తొలగినందుకు చేతి వేలికి గుచ్చుకున్న

సూది

కారుతున్న రక్తాన్ని చూసి క్షమాపణ అడిగినా


ఏం చేయగలను??

ఆ నొప్పి కన్నా నీ రాక కోసం ఎదురుచూసే

ఈ భాదే బాగుందని చెప్పడం కన్నా


ప్రియుడా

నా చెలికాడా....!!


ఇంకెందుకు ఆలస్యం ??


నీ చూపుల కిరణాలు తాకి


చిరుగుగుండె తావుల్లో

చిగురులు పుట్టేలా

వసంతంలో మేను మైమరిచేలా

జాగుచేయక రా..!!

--------- (4/5/2013)-------------

( @ copy rights reserved)