Wednesday, October 15, 2014

08 -ప్రియుడా .. నా చెలికాడా

నీటిఓరన నాటబడడానికి 
నేను కొట్టుకొచ్చిన క్షణాన
కష్టమే అనిపించింది. 

కాని
పడమటికి తూరుపు ఎంత దూరమో
నా మూర్ఖత్వాన్ని అతిక్రమాన్ని
కఠినత్వాన్ని చంచలబుద్దిని 
చుట్ట చుట్టి అంతదూరం
నువ్వు పడేసిన క్షణం 
పచ్చని చిగుళ్లు వేస్తు 
నేను కొత్తగా జన్మించాను

కృతజ్ఞతగా నీకేమి అర్పించలేని 
ఖాళీచేతుల్ని చూసి 
నాచుట్టున్నవారు నవ్వినప్పుడు
నాకు కూడా నా రిక్తహస్తాలు నచ్చలేదు 

కాని నువ్వన్నావ్ 
విరిగినలిగిన హృదయమే నీకిష్టమైన
బలి అని 

అందుకే
ప్రియుడా .. నా చెలికాడా

నా మోడుబారిన చేతుల్ని 
నీ సన్నిధిలో నాటాలనివచ్చా
నీ వాక్యంతో అంటుకట్టబడి అవి పూస్తున్నప్పుడు
నిన్ను పరిమళసువాసనగా 
ప్రతిచోటకి మోసుకెళ్తా


Tuesday, October 14, 2014

07- ప్రియుడా నా చెలికాడా

ఏది నీ చేయిలా చాచి నన్ను స్పృశించు

నా చుట్టూ ఉన్న మురికి నిన్ను తాకనివ్వలేదు కదూ


ఉదయమే పక్షులు నిన్ను ప్రార్ధించే వేళ
నా మంచంపై  నేను మూల్గుల ప్రార్ధనతో నిన్ను పిలుస్తాను
నాకు గుర్తుంది 
తేజోమూర్తిగా నువ్వు నా దగ్గరగా వస్తావు
నీ శ్వాస పరిమళం సాంబ్రాణి దూపమై నన్ను చుట్టుకున్నప్పుడు
నా జీవంలో ఉదయమై
నీ ముఖం తేటగా కనిపిస్తున్నప్పుడు
నన్ను నీతో నడకకు తీసుకెళ్తావ్

దావీదు కీర్తననొకటి హ్రదయంలోంచి గానం చేస్తూ
నీ ముఖం చూస్తున్న నన్ను చూసి
నా నుదుటిపై ముద్దు పెట్టుకోవాలని దగ్గరగా వచ్చావ్
కాని నన్ను తాకకుండా నా ఒంటికున్న మురికి
నిన్నుఆపివేసింది కదూ

జీవవృక్షం
స్పటిక సంద్రం చూపిస్తూ
నిన్ను హత్తుకోవాలనుకున్న నా కాంక్ష తీర్చడానికై
ఆ సిలువ దగ్గరికి నన్ను తోడుకొని వెళ్లి
నీ ప్రేమ నాకు చూపినప్పుడు
నేను నీరై నీలో కలిసిపోయిన మాట నిజం
నన్ను నీలో దాచుకున్న క్షణం 
నేను ఈ మట్టి శరీరాన్ని ప్రేమించడం
మానుకున్నది  నిజం. 

ప్రియుడా నా చెలికాడ ..!! 

బలు రక్కసి చెట్లలో నేనిక్కడే  నీ కోసం
ఎప్పుడూ 
నవ్వుతూ ఉండే వల్లిపద్మం  నేను 

నీ రాకడలో మహిమ శరీరం దాల్చినప్పుడు 
నీ రొమ్మున ఆనుకునే క్షణం కోసం 
ఆపేక్షతో నిరీక్షిస్తున్న గువ్వను నేను.